mt_logo

కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?: కేటీఆర్‌

ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ తెలంగాణలో అంటకాగుతున్న కాంగ్రెస్‌, బీజేపీ బంధంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఎవరు కూడా ఈ అంశం పైన మాట్లాడడం లేదని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని నిలదీశారు. ఫిక్షన్‌ కంటే వాస్తవం వింతగా ఉంటుందని అంటుంటారని.. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే దాన్ని నమ్మక తప్పడం లేదని కేటీఆర్‌ అన్నారు.

ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు కీలకమైన సంఘటనలను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో ఒక సంపన్నమైన కాంగ్రెస్‌ మంత్రి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి జరిపిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ దాడిలో వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని అన్నారు.

రెండు వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూకు ఒక్క మాట బయటకి రాలేదని కేటీఆర్ తెలియజేశారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్‌ గానీ.. బీజేపీ నుంచి గానీ.. ఈడీ నుంచి గానీ ఈ అంశంపైన నోరు మెదపలేదని పేర్కొన్నారు.

కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ. 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్‌ గుర్తుచేశారు.

అయితే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఏమీ జరగలేదని తెలిపారు. కనీసం దారి మళ్లిన నిధుల తాలూకు అంశం పైన ఇప్పటిదాకా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. వీటన్నింటి బట్టి ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులను రక్షిస్తున్న పెద్ద అన్న ఎవరై ఉంటారని ప్రశ్నించారు.