mt_logo

పోలవరం డిజైన్ మార్చకుంటే ప్రాజెక్ట్ కట్టనివ్వం-కేసీఆర్

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుంటే ఊరుకునేదిలేదని, కాని పక్షంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, సీమాంధ్రలో కలిపే మండలాల విషయంలో టీడీపీ, బీజేపీ వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని, కోర్టుకు వెళ్ళైనా ఆ ఏడు మండలాలను కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. బుధవారం పటాన్ చెరు, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, మహేశ్వరం, మునుగోడు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, వైసీపీలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులు నిండిన తర్వాతే సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తామని, ఈ విషయం గురించి కూడా టీడీపీ, బీజేపీ పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమే అని, రాష్ట్ర పునర్నిర్మాణమే క్లైమాక్స్ అని చెప్పారు. ‘ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకే పోవాలని అన్నా. వారికి ఆప్షన్లు ఉండవు. దీనికోసం ఎంతకైనా పోరాడుతాం. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తారు. కేసీఆర్ ప్రజల కోసం, ఉద్యమం కోసం మాట్లాడుతాడు. తెలంగాణ వస్తుందని తీర్మానం చేసినరోజే ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే నన్ను విమర్శించి, నాపై విరుచుకుపడ్డారు. నేనేమైనా తప్పు మాట్లాడానా?’ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలనుద్దేశించి మాట్లాడారు. 16 ఎంపీ సీట్లు గెలిచి డిల్లీ మెడలు వంచి నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు పోకుండా చూసుకోవాలని, కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి మనం కల్పించామని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంటికి అంటకుండా మనల్ని మింగుతారని, అందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినతర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆటోరిక్షాలు నడిపే రెండు లక్షల కార్మికులను రవాణాపన్ను నుండి మినహాయిస్తామని, పోలీసులు, రవాణాశాఖ అధికారులనుండి వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని, డ్రైవర్లందరికీ ఆరోగ్య భీమాను, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలుచేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *