పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకురావద్దని, ఆదరాబాదరా నిర్ణయాలు తీసుకోవద్దని తాము మోడీని కోరామని, ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పోలవరంపై హోంశాఖ తయారుచేసిన ఆర్డినెన్స్ ను తాను తీవ్రంగా వ్యతిరేకించానని, కేంద్రం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేసీఆర్ డిల్లీలో మీడియాతో చెప్పారు.
ప్రస్తుతం పోలవరం కడుతున్న ప్రాంతంలో భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచించారని, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు పోలవరాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్లాయని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దులు మార్పులు చేయాలంటే ఆర్టికల్ – 3 ప్రకారం సవరణలు చేయాల్సి ఉంటుందని, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడం సరికాదని, ముంపు ప్రాంతాలపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఇవాళే ఆర్డినెన్స్ తీసుకొస్తే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించవచ్చని, లేకపోతే మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకతప్పదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 2 లోపు పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకొస్తే ఖమ్మంజిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో కలిసిపోనున్నాయి.