mt_logo

నిర్ణీత సమయంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం – కేటీఆర్

కేంద్రం నిర్దేశించిన సమయంలోనే ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తిచేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం తన నివాసంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ ఐటీ రంగం అభివృద్ధికి గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నామమాత్రపు ఎంప్లాయిమెంట్ చార్జీలతోనే ఇన్సూరెన్స్ ఉండాలని టిటా ప్రతినిధులు కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీ జోన్లలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం భద్రతను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే భారీగా రాయితీలు అందిస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగులు రోజుకు 14 గంటలు పనిచేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు, మానసిక ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగుల్లో 36 శాతం మంది మద్యానికి బానిసలుగా మారారని, హైదరాబాద్ లో కంప్యూటర్ కోర్సుల పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునేందుకు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని టిటా అధ్యక్షుడు సందీప్ కుమార్ కోరారు.

మరోవైపు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ప్రతినిధులు కూడా కేటీఆర్ ను ఆయన నివాసంలో బుధవారం కలిసి పారిశ్రామికరంగ సమస్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి, పరిశ్రమలకు ఆదాయమార్గాలు పెరగాలంటే పరిశ్రమల విస్తరణ అనివార్యమని టిఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి చెప్పారు. సీమాంధ్రకే రాయితీలు పరిమితం చేయడంవల్ల పారిశ్రామికవేత్తలు సీమాంధ్రలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసే అవకాశాలున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేయగా, తెలంగాణలోనూ ట్యాక్స్ హాలిడేను ప్రకటించేలా కేంద్రంపై టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుందని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *