mt_logo

తెలంగాణ భూములపై మళ్ళీ సర్వే చేయిస్తాం – కేటీఆర్

నాంపల్లిలోని అగ్రి డాక్టర్స్ భవన్ లోని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆదివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూముల వివరాల్లో చాలా లోపాలు ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ భూములపై రీసర్వే చేయిస్తామని, 1954 తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ సర్వే నిర్వహించలేదని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు మాత్రమే ఉండాలని, కేటగిరీల వారీగా భూములు ఉండడానికి వీల్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పారదర్శకంగా లేకపోవడంతోనే సీమాంధ్ర అధికారులు తెలంగాణ భూములన్నిటినీ కొల్లగొట్టారని, ఉద్యోగులపై భారం పడకుండానే సర్వే నిర్వహిస్తామని చెప్పారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందజేయడంలో ఆర్డీవో, ఎమ్మార్వోల పాత్ర కీలకమని, తెలంగాణ రాష్ట్రంతో వచ్చే అభివృద్ధి ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందించి వారి కళ్ళల్లో వెలుగులు చూసినప్పుడే తనకు సంతృప్తి కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ అవినీతిని అంతమొందించే దిశగా అధికారులు పనిచేయాలని, అది సీఎం కార్యాలయం నుండి ప్రారంభం కావాలని, ఇప్పటి వరకు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు సీఎం గా వస్తున్నారని, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెవెన్యూ శాఖ అధికారులు 60 లక్షల రూపాయలను అందజేశారు. తెలంగాణ తహశీల్దారుల ఒక్కరోజు వేతనం సుమారు 10 లక్షల రూపాయలు కాగా, తెలంగాణ వీఆర్వోల సంఘం 50 లక్షల రూపాయలు ఒకరోజు వేతనంగా అందజేస్తున్నట్లు వీఆర్వోల సంఘం అధ్యక్షుడు బీ. రాంరెడ్డి ప్రకటించారు. మరోవైపు జైళ్ళ శాఖ ఉద్యోగులు కూడా సీఎం సహాయనిధికి రూ. 30 లక్షలు అందజేసిన సందర్భంగా కేటీఆర్ వారిని సన్మానించారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక చైర్మన్ కే రాములు, తెలంగాణ తహశీల్దారుల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రజాకవి గోరటి వెంకన్న, తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *