ఉద్యమస్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలో కరీంనగర్ ఎంపీ వినోద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినోద్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణను అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటానని, కేంద్రం నుండి అధిక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ను తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసి తీరుతామని, రెండేళ్ళ తర్వాత 24గంటల విద్యుత్ సరఫరా ఖచ్చితంగా అమలుచేస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చిందని సంబరపడకుండా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాజేందర్ అన్నారు.