బుధవారం హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెట్రోఫిట్టింగ్ ఐదు సూత్రాల కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నగరంలోని ఐటీ సంస్థల్లో పర్యావరణాన్ని పెంపొందించడానికి రెట్రోఫిట్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేలా ఉద్యోగం చేసే ప్రదేశాలకు సైకిల్ పై వెళ్ళడం, మొక్కలను పెంచడం, నీటినిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవడం, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టడం వంటి ఐదు సూత్రాలను అమలు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండువందల కోట్ల మొక్కలను నాటేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ ఐదు సూత్రాలను అమలుచేసే సంస్థలకు ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయల బహుమతిని అందిస్తామని కేటీఆర్ చెప్పారు. అనంతరం టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెట్రోఫిట్టింగ్ ఆలోచన వచ్చిందని అన్నారు.