mt_logo

తెలంగాణ ఐటీ విధానాలను తమిళనాడులోనూ అమలు చేస్తాం: తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను, ఐటీ, ఐటీ అనుబంధ విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పాలసీలను కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆయన ఆధ్వర్యంలోని ఒక బృందం తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా నిన్న మంత్రి కే తారక రామారావు తో సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈరోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ వర్క్స్, టీ హబ్, వీ హబ్, గచ్చిబౌలిలోని టీఫైబర్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం హైదరాబాద్లో ఉన్న టెక్ మహీంద్రా కార్యాలయంలో పలువురు ఐటీ పరిశ్రమ భాగస్వాములతో సమావేశమయ్యారు.


ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ఐటీ శాఖ అధికారులు త్యాగరాజన్ కు వివరించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్న మంత్రి.. ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ఈ రెండు నగరాలకు తోడుగా ఉండాల్సిన తమిళనాడు.. గత పాలకుల వల్ల ఐటీలో వృద్ధి సాధించలేకపోయిందన్నారు. తాను ఐటీ బాధ్యతలు చేపట్టాక తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్‌ను సందర్శించినట్లు త్యాగరాజన్ వెల్లడించారు. తన పర్యటన తప్పకుండా అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేలా ఉంటుందన్నారు.