mt_logo

కృష్ణా నీళ్ళకోసం మనమంతా పోరాడాలి – కేసీఆర్

కృష్ణా నది నీళ్ళకోసం మనమంతా కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్ని రాజకీయపక్షాలను కోరారు. కృష్ణాలో తెలంగాణ వాటా 377 టీఎంసీలు, గోదావరిలో తెలంగాణ వాటా 900 టీఎంసీలు ఉన్నాయని, మొత్తం 1277 టీఎంసీల నీళ్ళు రావాలని అన్నారు. దీనివల్ల తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందని, కృష్ణా నుండి నూటికి నూరుశాతం హైదరాబాద్ కు నీళ్ళు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. అవసరమైతే తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందు వాదిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును ఆఘమేఘాలమీద, ఎన్ని అప్పులు తీసుకొచ్చి అయినా త్వరితగతిన పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిచేసి ఫ్లోరైడ్ నేలల్లో తాగు, సాగునీరు పారించడం ద్వారా ఫ్లోరైడ్ ను తరిమికొడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుందని, ఈ పథకం వల్ల చేవెళ్ళ, పరిగి, తాండూరు, దక్షిణ నల్గొండకు నీళ్ళు వస్తాయని తెలిపారు.

పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రేపు తీర్మానం చేద్దామని, అఖిలపక్షంగా వెళ్లి ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరుదామని అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. పేదలకు 125 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పాతబస్తీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, త్వరలో పాతబస్తీలో పర్యటిస్తామన్నారు. రంజాన్ ఏర్పాట్లపై 15, 16 తేదీల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ లో యుద్ధప్రాతిపదికన డ్రైనేజి పూడికతీత పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎదుట మెట్రో రైలు నిర్మాణం భూగర్భ మార్గంలో వెళ్ళేలా మార్పులు చేయాలని, మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు శిథిలం కాకుండా చూడాలని ఎల్ అండ్ టీకి సూచించామని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *