mt_logo

తెలంగాణలో పెట్టుబడులకు స్నేహహస్తం అందిస్తాం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని, పరిశ్రమలు నెలకొల్పేందుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తామని ఐటీ మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. శుక్రవారం రౌండ్ ఇండియా అనే సంస్థ ‘హైదరాబాద్ ది రోడ్ ఎహెడ్’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు భౌగోళికంగా విడిపోయాయే తప్ప మనుషులుగా కాదని, స్వయం పాలన, సుస్థిర పాలన, పరిపాలన వికేంద్రీకరణ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటాయని, వాటన్నింటినీ పరిష్కరించే దిశలో పనిచేస్తామని అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది ఐదునెలలు పూర్తవుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఏ ఒక్కరికైనా ఎలాంటి ఇబ్బందైనా ఎదురైందా? అని ప్రశ్నించారు. కొన్ని పత్రికలు, మీడియా అర్థంలేని భయాందోళనలు సృష్టిస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ను తొలి వై ఫై నగరంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నిస్తామని, 4జి సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, భవిష్యత్ లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ చుట్టూ 200లకు పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, అందులో చదివే విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలతో అనుసంధానం చేయాలని అనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని మరింతగా పొడిగించనున్నట్లు, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలకు కూడా పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపడతామని, దీనివల్ల ప్రత్యక్షంగా 15 లక్షలు, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

తెలంగాణలో సీఎంగా ఉన్నది కేజ్రీవాల్ కాదని, కేసీఆర్ అన్న విషయాన్ని పారిశ్రామికవేత్తలు గుర్తించాలని, 14 ఏళ్ల క్రితం తెలంగాణ కోసం పార్టీని స్థాపిస్తే అవహేళన చేసినవారు ఇప్పుడు ఏమంటారని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీగా వర్ణిస్తూ, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ప్రతినిధులు సంజయ్, కిరణ్, సురేష్ తదితరులు నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *