ఆదివాసీలు అత్యధికంగా నివసిస్తున్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వడం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈటెల పోలవరంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని, గురువారం టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదని, ఆంక్షలు వెంటాడుతూనే ఉన్నాయని, పోలవరం ఆర్డినెన్స్ ను కేంద్రం వెనక్కు తీసుకోకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు, ప్రధాని మోడీ ఇందుకు సిద్ధంగా ఉండాలని, తెలంగాణపై చంద్రబాబు చేస్తున్న కుట్రలకు తెలంగాణ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పారని, ఇప్పుడు బిడ్డనే చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలని ప్రధాని మోడీని కోరినా ఆయన పట్టించుకోలేదని, ముంపుకు గురయ్యే ఏడు మండలాలను రక్షించే వరకు న్యాయపోరాటం చేస్తామని రాజేందర్ స్పష్టం చేశారు.