ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ సమావేశంలో ఆస్పత్రి విషయమై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ ఆస్పత్రి బాగుకోసం చేసే ఏ ప్రయత్నాన్నైనా స్వాగతిస్తామని, ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిద్దామని చెప్పారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వద్దని, ఆస్పత్రి బాగుకోసం మార్గాన్ని అన్వేషిద్దామని కోదండరాం సూచించారు.
మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది. ఉస్మానియా ఆస్పత్రి మొత్తాన్ని తరలించడం లేదని, పాత భవనంలోని కొన్ని విభాగాలను మాత్రమే తరలిస్తున్నట్లు, ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.