హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో వాటర్ గ్రిడ్ పైప్ లైన్ మేనేజ్ మెంట్ వర్క్ షాప్ ను పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని చెప్పారు. నగరంలోని నీటి సరఫరా విషయంలో వాటర్ గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి హడ్కో లాంటి సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు.
రక్షిత మంచినీరు ప్రాధమిక హక్కుగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, రాష్ట్రంలోని 85 లక్షల ఇళ్ళకు మంచినీరు నల్లాల ద్వారా సరఫరా చేయడమే లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానం తొలగించామని తెలిపారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగింది.. కానీ ఇప్పుడు పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగమే డీపీఆర్ ను రూపొందించిందని, డీపీఆర్ ను వ్యాప్కోకు అప్పగించి పారదర్శకంగా పని చేస్తున్నామని మంత్రి వివరించారు.