వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి గుజరాత్ లో ఐటీ మంత్రి రెండురోజుల పర్యటన ఆదివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకోసం ఈ ప్రాజెక్టును మిషన్ మోడల్ లో ముందుకు తీసుకెళ్తామని, దానికి సంబంధించిన నిర్వహణను స్వయం సహాయక బృందాలకు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
వాటర్ గ్రిడ్ కు సంబంధించిన అన్ని అంశాలపై తెలుసుకోవడానికి రాష్ట్రానికి చెందిన కొందరు అధికారుల బృందంతో కలిసి కేటీఆర్ గుజరాత్ లో పర్యటించారు. అక్కడి అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్ కు గుజరాత్ లో వాటర్ గ్రిడ్ అమలవుతున్న తీరుతెన్నుల గురించి అధికారులు వివరించారు. గుజరాత్ లోని నవ్దా వాటర్ పంపింగ్ కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించారు. 12 మోటార్లను బిగించి నర్మదా డ్యాం నుండి ఎనిమిది టీఎంసీల నీటిని 2325 గ్రామాలకు, 38 పట్టణాలకు అందిస్తున్న పంపింగ్ విధానాన్ని కేటీఆర్ ప్రశంసించారు. పంపింగ్ బాధ్యతను పన్నీ సమితి మహిళలే చూసుకుంటున్నట్లు, గుజరాత్ తాగునీటి అవసరాల్లో 60 శాతం నదుల నుంచి, 40 శాతం జలవనరుల నుండి తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు వివరించారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలను కూడా వాటర్ గ్రిడ్ నిర్వహణలో భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని మన రాష్ట్ర అధికారులకు మంత్రి సూచించారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే వాటర్ గ్రిడ్ కు తగిన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని గుజరాత్ అధికారులు కేటీఆర్ కు హామీ ఇచ్చారు. గుజరాత్ పర్యటనలో కేటీఆర్ తోపాటు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పంచాయితీ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, తాగునీటి సరఫరా సలహాదారు చీఫ్ ఇంజినీర్ బాబూరావు తదితరులు ఉన్నారు.