రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆమోదం తెలిపిన ఈ ఫైల్ ను రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం కంపెనీల రిజిస్ట్రేషన్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పంపింది. కంపెనీల రిజిస్ట్రేషన్ శాఖ ఆమోదం తర్వాత కార్పొరేషన్ పాలకమండలి సభ్యుల నియామకం జరగనుందని తెలిసింది.
మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆవిర్భవించనుంది. ఈ కార్పొరేషన్ లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. చైర్మన్, ఎండీతో పాటు 12 నుండి 15 మంది సభ్యులను వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ లో నియమించే అవకాశం ఉందని తెలిసింది. జలహారం పథకం పనులు, నిధుల వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి ఈ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.