రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగుల విభజన ప్రక్రియలో జరుగుతున్న సీమాంధ్రులు అక్రమాలకు పాల్పడటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఎలాగైనా తెలంగాణలో తిష్టవేయాలని చూస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు స్థానికత విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా టీఆర్ఎస్ పార్టీ వార్‌రూం ను ఏర్పాటు చేసింది.
సమయం ఎక్కువగా లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన తెలంగాణ ఉద్యోగులందరి స్థానికత వివరాలను సేకరించడానికి వార్‌రూం అని పేరుపెట్టారు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని భయపడ్డ సీమాంధ్ర ఉద్యోగులు వార్‌రూం పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. వీళ్ళకు వత్తాసుగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబైతే ‘వార్‌రూం దేనికని? ఎవరిపై యుద్ధం చేస్తారని? యుద్ధానికే వార్‌రూం ఐతే తాను అక్కడికి వస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ నేతలు, టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం తదితరులు బాబుపై ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ, తొమ్మిదేళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు వార్‌రూం అంటే తెలియకపోవడం విచిత్రమని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఉద్యోగుల సమాచారం కోసం టీఆర్ఎస్ పార్టీ వార్‌రూం ఏర్పాటు చేస్తే బాబు దీనిపై వక్రీకరిస్తున్నారని, కేసీఆర్‌ను చంద్రబాబు విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
చంద్రబాబు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, జూన్ 2 తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని, ఇప్పుడు జరిగేది తాత్కాలిక విభజనే అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మరోవైపు టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కూడా బాబు వైఖరిని తప్పుబట్టారు. మార్గదర్శకాలపై చంద్రబాబుకు అవగాహన లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులపై ఆయనకు గౌరవం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను సీమాంధ్రకు కేటాయించాలని సూచించారు.