తెలంగాణ భవన్లో వార్ రూమ్ ఏర్పాటైన సందర్భంగా ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లు మీడియాతో మాట్లాడారు. వార్ రూమ్ ఏర్పాటుచేసింది యుద్ధాలు చేయడానికి కాదని, ఉద్యోగుల విభజన విషయంలో పొరపాట్లు జరగకుండా యుద్ధప్రాతిపదికన సమాచారం సేకరించడానికని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మంచివికావని, సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే ఇక్కడకు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని, ఏ రాష్ట్ర సచివాలయంలో ఆ రాష్ట్ర ఉద్యోగులే పనిచేస్తే మంచిదని, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడితే ఊరుకోమని హెచ్చరించారు. విడిపోయిన తర్వాతకూడా పెత్తనం చెలాయిస్తామంటే రెచ్చగొట్టడం కాదా? అని చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించారు. చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.