mt_logo

వార్ వన్‌సైడే..

-దూసుకుపోతున్న కారు..!
– పరాజితులతో పందెం ఒడ్డిన ప్రతిపక్షాలు
-మెదక్ జిల్లాలో తిరుగులేని టీఆర్‌ఎస్
– ఇతర పార్టీల నుంచి భారీ వలసలు
– ఉపఎన్నిక ముందు ప్రతిపక్ష శిబిరాలు ఖాళీ
ఫరీదుద్దీన్.. 40 వేల మైనార్టీ ఓట్లున్న జహీరాబాద్‌కు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. మైనార్టీలకు పెద్ద అండగా ఉన్న నేత. నరేంద్రనాథ్.. హిందుత్వను బలంగా వినిపించే పార్టీ తరపున పోటీచేసిన నేత. హిందుత్వను అభిమానించే వేలమంది కార్యకర్తలకు నాయకుడు. కొద్ది నిమిషాల తేడాతో ఇద్దరూ తమ పాత పార్టీల, సిద్ధాంతాల బంధాలు తెంచేసుకుని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన ఇంటిపార్టీలో చేరిపోయారు. ఈ ఇద్దరూ మెదక్ జిల్లాకు చెందినవారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే..ఆ జిల్లా రాజకీయంలో టీఆర్‌ఎస్ సామర్థ్యం ఏమిటో.. కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న మెదక్ ఫలితం ఏమిటో ఊహించడం పెద్ద కష్టం కాదు.

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై కారు దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర పార్టీల దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్… టీడీపీ… బీజేపీ…వైఎస్సార్సీపీ తేడాల్లేకుండా అన్ని పార్టీలనుంచి నాయకులు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్నారు. మెదక్ ఉప ఎన్నిక ముంగిట ఆ జిల్లాలో ఇతర పార్టీలు ఖాళీ అవుతున్న తీరు మహామహులకే షాక్ ఇస్తున్నాయి. మాజీ మంత్రులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు ఒకరి వెంట ఒకరు గులాబీ గూటిలో చేరిపోతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం, తెలంగాణ భవన్‌నుంచి మొదలుకొని క్షేత్రస్థాయిలోని నియోజకవర్గాల కేంద్రాల శిబిరాల దాకా ప్రతిరోజు నాయకులు, కార్యకర్తల చేరికలు జాతరను తలపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు పూర్తి అవుతున్న సమయంలోనే పోటీకి దిగిన పార్టీలకు చెందిన సీనియర్లు టీఆర్‌ఎస్‌లో చేరిపోవడం ఆ పార్టీలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. పోలింగ్ నాటికి మెతుకుసీమ మొత్తం గులాబీ మయం కావడం ఖాయమనే సంకేతాలు కన్పిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఏకపక్షం కానున్నదని చెబుతున్నారు.

మెదక్‌కు రాజకీయ ప్రాధాన్యత..
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాజీనామాతో జరుగుతున్న మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో గులాబీదళం ఇక్కడ విజయదుందుభి మోగించినందున ఉప ఎన్నికలోనూ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేయడం నల్లేరు మీద నడకలాంటిదే. దీనికి ఇపుడు జరుగుతున్న చేరికలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు మరింత బలాన్నిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన నాయకులంతా తెలంగాణ పునర్నిర్మాణ రథసారధి కేసీఆర్ వెంటనడవాలని నిర్ణయించుకుంటున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నిన్న ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నేడు నరేంద్రనాథ్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌లు వరుసకట్టి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ చేరికలు ప్రజల మనోభిప్రాయానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత 60 ఏళ్లుగా ఏ పార్టీ చేపట్టని పథకాలు, విధానాలతో సీఎం కేసీఆర్ పాలన సాగడం అన్ని పార్టీల వారిని ఆకట్టుకుంటున్నదని అంటున్నారు. కాంగ్రెస్ వంటి జాతీయపార్టీలో మూడు నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన నాయకులు టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయపార్టీలో చేరడం మామూలు విషయం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఎన్టీఆర్ వంటి నాయకుడి హయాంలో కూడా పార్టీని వీడడానికి ఇష్టపడని నేతలు కూడా ఇవాళ టీఆర్‌ఎస్ నీడన చేరడం ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణకు చిహ్నమని భావిస్తున్నారు.

ప్రతిపక్షాలకు ఆదిలోనే హంసపాదు..
ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పొందిన రాజకీయ పక్షాలు ఈ ఉప ఎన్నికల్లోనైనా ఉనికిని చాటుకోవాలని ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా అవి నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఆయా పార్టీలకు వలసలు ఆదిలోనే హంసపాదులా తయారయ్యాయి. పార్టీల కీలక నేతలే జెండాలు వదిలి గులాబీ గూటికి చేరుకుంటున్నారు. గురువారం కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌తో పాటు గత ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేంద్రనాథ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఆయా పార్టీల పరిస్థితికి అద్దం పడుతున్నది. వీరితో పాటు భారీ సంఖ్యలో క్యాడర్ వలస వెళ్లడం రెండు పార్టీలను నైతికంగా కుంగదీసినట్లయింది. ఇక నామినేషన్ల గడువు ముగిసీ ముగియగానే మెదక్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరిగిపోయాయి. గురువారం సంగారెడ్డి, నర్సాపూర్‌లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జరిగాయి. శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ భారీస్థాయిలో ఇతర పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

చెల్లని రూపాయిలతో…
మెదక్ స్థానంలో నిలిచిన ఇద్దరు ప్రతిపక్ష అభ్యర్థులూ గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన వారే కావడం గమనార్హం. అసెంబ్లీ సీటుకే గెలువని వారు ఏకంగా ఎంపీ సీటును ఎట్లా గెలుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రాత్రికి రాత్రి బీజేపీ గూటికి చేరిన జగ్గారెడ్డి టీడీపీ మద్దతుతో కమలం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకిగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పంచన చేరి… తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన అనేక ప్రకటనలు… ఆంధ్రా సీఎం మెప్పుకోసం ఏకంగా ప్రత్యేక రాష్ర్టాన్ని ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి రాసిన లేఖలు ఈ సందర్భంగా తెరపైకొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సైతం సమైక్య వాదాన్ని వినిపించి, ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సవాళ్లు చేసి ప్రకటించి, చివరకు సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే పవన్ కళ్యాణ్… జగ్గారెడ్డికి టికెట్ రావడంలో కీలక పాత్ర వహించారనే ప్రచారంతో స్థానికంగా కమలనాథులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణ టిక్కెట్లను ఆంధ్రావాళ్లు నిర్ణయిస్తుంటే నోళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ఆవేదన వారిలో కనిపిస్తున్నది. ఈ ఎంపికపై ఆగ్రహంతోనే నరేంద్రనాథ్ పార్టీని వీడి వెళ్లారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీ కాస్త బలంగా ఉందని భావించిన సంగారెడ్డిలో ఉన్న ఒక్క జగ్గారెడ్డి గుడ్‌బై చెప్పడంతో బలం ఎక్కడో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మెదక్‌లో టీఆర్‌ఎస్‌దే హవా..
మెదక్ జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దెబ్బకు కాంగ్రెస్ హేమాహేమీలు మట్టికరిచారు. రాజనరసింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి, ముత్యంరెడ్డి లాంటి వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 10 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిందింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా స్వల్ప మెజార్టీతో జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, నారాయణ్‌ఖేడ్ నుంచి కిష్టారెడ్డి విజయం సాధించారు. జిల్లా ప్రజలు ఇచ్చిన షాక్‌తో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. తిరిగి బలమైన శక్తిగా ఎదుగుతామనే కాంగ్రెస్‌పార్టీ ధీమా అతిస్వల్పకాలంలోనే ఆవిరైపోతున్నది. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబీ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. క్యాడర్ మొత్తం ఆయన దారిలో నడిచింది. మూడునెలలవుతున్నా ఇక్కడ మరో ఇన్‌చార్జ్‌ని నియమించుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌ది. పటాన్‌చెరులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. పటాన్‌చెరుకే చెందిన జిల్లా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి కూడా రెండు రోజుల క్రితం క్యాడర్‌ను వెంటేసుకుని మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్ కుప్పకూలింది. జగ్గారెడ్డి బీజేపీలో చేరిపోయి మెదక్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రస్తుతం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి మరో నాయకుడే కరువయ్యాడు. మరోవైపు జగ్గారెడ్డి బీజేపీలో చేరడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ గురువారం సంగారెడ్డిలో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం తొలినుంచీ టీఆర్‌ఎస్ కంచుకోటే. మెదక్ అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ విజయశాంతి చిత్తుగా ఓడిపోయారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగాఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో పార్టీ క్యాడర్ టీఆర్‌ఎస్ దారి పట్టారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పార్టీలో ఒంటరివారయ్యారు. ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండగా నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలోకి చేరిపోతున్నారు. ఇక మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతారెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా గులాబీ హవా కొనసాగుతున్నది. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అధికారంలో ఉండగా జనం బాధలు పట్టించుకోలేదనేది సునీతపై ప్రజల ఫిర్యాదు. అధికారంలో ఉండి తెలంగాణ అంశాన్ని విస్మరించారన్న ముద్ర ఉంది. పై ఏడు నియోజకవర్గాలు ప్రస్తుతం జరుగుతున్న మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. మిగిలిన జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలు జహీరాబాద్ ఎంపీ పరిధిలోనివి. జహీరాబాద్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే గీతారెడ్డికి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ షాక్ నిచ్చారు. గురువారం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజనరసింహ ఆందోల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. ఇక నారాయణ్‌ఖేడ్‌లో టీఆర్‌ఎస్ బలపడుతున్నది.

బీజేపీ, టీడీపీల జాడేలేదు..
జిల్లాలో బీజేపీ, టీడీపీ జాడే కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేన్ ట్రస్ట్ అధినేత నరేంద్రనాథ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బల్విందర్‌నాథ్‌లు గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. నరేంద్రనాథ్ చేరిక బీజేపీకి పెద్ద కుదుపుగా భావిస్తున్నారు. జిల్లాలో బీజేపీకి ఉన్న క్యాడరే అంతంత మాత్రం. వారిని వెంటేసుకుని నరేంద్రనాథ్ గుడ్‌బై కొట్టారు. ఇక మిగిలింది పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాలా బుచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ,రఘునందన్‌రావు మాత్రమే. టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల ముందు ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో కొంత బలం ఉండేది. అయితే ఆక్కడ కేసీఆర్ పోటీ చేయడంతో క్యాడర్ టీఆర్‌ఎస్‌లో చేరింది. ప్రస్తుతం జిల్లా టీడీపీలో ఆ పార్టీ అధ్యక్షురాలు శశికళయాదవరెడ్డి, గజ్వేల్ ఇన్‌చార్జ్ ప్రతాప్‌రెడ్డి మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల మాసాయిపేట రైలు ప్రమాద మృతులకు పరిహారం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ వచ్చినపునడు పార్టీ క్యాడర్ కనిపించక షాక్ తిన్నట్లు, జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా అయ్యిందా? అంటూ ఆసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగ్గారెడ్డికి ఏ నియోజకవర్గంలో ఓట్లు వస్తాయో తెలియని స్థితిలో ఆ రెండు పార్టీల నాయకులున్నారు.

ఇదీ ఓట్ల సరళి..
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, మెదక్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవరాలున్నాయి. మొత్తం 15,33,330 ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 2,76,941 ఓట్లు ఉండగా, అత్యల్పంగా దుబ్బాకలో 1,82,953 ఓట్లున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పరిశీలిస్తే… టీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌కు 6,57,492 , కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్‌కుమార్‌రెడ్డికి 2,60,463, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌కు 1,81,804 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ 3,97,029 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు 93,328, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి 39,600, ఎమ్మెల్యే రామలింగారెడ్డి 37,899, మదన్‌రెడ్డి 14,160, చింతా ప్రభాకర్ 29,236 వేల ఓట్ల భారీ మెజార్టీలో గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన భారీ మెజార్టీలు ఆ తర్వాత వివిధ పార్టీల క్యాడర్ టీఆర్‌ఎస్‌లో చేరికలు పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం అవుతున్నది.

మొదలైన టీఆర్‌ఎస్ కార్యాచరణ..
మెదక్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగియడంతో అధికార టీఆర్‌ఎస్ తన వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టింది. గురువారం పార్లమెంటు పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వీటికి విశేష స్పందన వచ్చిందని జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు. ఈనెల 30న గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఈ సమావేశాలు ముగుస్తాయని, పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సంసిద్ధం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మరోవైపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారపర్వంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎవరెవరు ఎక్కడెక్కడ అనే కార్యాచరణకు ఇంకా తుది రూపు రావాల్సి ఉంది. నిజామాబాద్ ఎంపీ కవిత పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఒకటీ, రెండు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన షెడ్యూలు మాత్రం ఖరారు కాలేదని పార్టీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *