చిత్రం: విశాలాంధ్ర మహాసభ వారు ఆడుతున్న పచ్చి అబద్ధాలకు పై చిత్రమే ఒక సాక్ష్యం. నెహ్రూ విశాలాంధ్రను సామ్రాజ్యవాదం అనలేదని పరకాల బ్యాచి బుకాయిస్తున్నది. 1953 అక్టోబర్ 3 నాటి ఆంధ్రప్రభలో ప్రచురితమైన పైవార్త క్లిప్పింగ్ వారి అబద్ధాల జాతరకు విస్పష్ట సాక్ష్యం.
—
‘బాక్సింగ్‌లో కిందపడినవారికి ఒకటి.. రెండు.. అంటూ పది అంకెల వరకు అవకాశం ఇస్తారు. మేము కూడా ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ప్రచురించి ఒకటి రెండు అంటూ 80 రోజులు లెక్కించాం. ఒక్కరు కూడా ఖండించలేదు. ఒక్కరు కూడా విమర్శించలేదు. ఒక్కటి తప్పని రుజువు చేయలేదు. … ఈ పుస్తకం ద్వారా తెలంగాణవాదాన్ని మట్టుబెట్టగలిగాం’
ఇదీ నిన్నటి పుస్తకావిష్కరణ సభలో పరకాల ప్రభాకర్ ప్రేలాపణ.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంపై పరకాల బ్యాచి ప్రచురించిన పుస్తకంలో వంద అంశాలు ప్రస్తావిస్తే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తది లేదు. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులకు అయితే ఆ పుస్తకం చదివితే విసుగొస్తుంది.
అందులో పరకాల బ్యాచి విన్యాసాలు ఒక్కటి కాదు. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ నాయకులు జవాబు చెప్పిన అంశాలని మళ్లీ కొత్తగా ప్రస్తావించడం, సాక్షాత్తూ రాజ్యాంగం, రాష్ట్రా పునర్విభజన కమీషన్ , పార్లమెంటు, సుప్రీం కోర్ట్, రాష్ట్రపతి, కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ – ఇట్లా దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తులు తెలంగాణకు అనుకూలంగా చెప్పిన అంశాలను కూడా వక్రీకరించడం; తెలంగాణ ఉద్యమకారులు ఎన్నడూ అనని అంశాలను వారి నోట్లో పెట్టడం; కమిటీలు, కమీషన్లు, వ్యక్తులు చెప్పిన అంశాలను అసంపూర్తిగా ఉటంకించడం; ఒకటే అంశాన్ని నాలుగు అంశాలుగా విడగొట్టడం; తాము ఇదివరకు సత్యం అని అన్నవాటినే అసత్యాలని అనడం; తమ పుస్తకంలోని అంకెలను తామే ఖండించుకోవడం ఇట్లా సాగింది పరకాల బ్యాచి పుస్తకం.
వీరు రాసిన పాచి అబద్ధాలలో చాలా వాటిని వీళ్ళు పుట్టకముందే తెలంగాణ నాయకులు ఖండించారు. తెలంగాణవాదం దెబ్బకు విశాలాంధ్రవాదం ఆరు దశాబ్దాల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే మమ్మీని ఎన్నినాళ్ళు మ్యూజియంలో పెట్టి ఆక్సిజన్ అందించినా అది మళ్ళీ జీవం పోసుకోదు.
వీరి ప్రతి పాచి అబద్ధానికి మన దగ్గర జవాబు ఉన్నది. ఈ నెలాఖరుకు ఢిల్లీలో ఆవిష్కారం అయ్యే పుస్తకంలో విషాంధ్ర మహాసభ బండారం మొత్తం బయటపెడతాం.