ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరగాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ శుక్రవారం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై కమల్ నాథన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన విఠల్ ను తెలంగాణకు మార్చేలా ఇంటర్మీడియెట్ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల విభజనపై వస్తున్న అభ్యంతరాలను నిశితంగా గమనిస్తున్నామని, రెండు ప్రాంతాలకు న్యాయం చేసేలా విభజన ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు.
దాదాపు గంటపాటు కమల్ నాథన్ తో చర్చించిన తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నేతలు పలు అంశాలను ఆయనకు వివరించారు. సచివాలయంలో ఉద్యోగుల జాబితాలో జరిగిన తప్పులన్నిటినీ సరిదిద్దాలని, విఠల్ ను తెలంగాణకు మార్చాలని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని, జాబితాల్లోని లోపాలను సవరించాలని కోరారు. కమల్ నాథన్ ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, విఠల్, తెలంగాణ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, ఇంటర్ తెలంగాణ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పీ మధుసూదన్ రెడ్డి, గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలని గతంలో ఎన్నిసార్లు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వ మార్గదర్శకాల్లో కూడా స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలని స్పష్టంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందునుంచీ కీలకంగా పనిచేస్తున్న విఠల్ ను కావాలనే ఆంధ్రాకు బదిలీ చేశారని, ఎస్ఎస్‌సీ బోర్డులో కానీ, ఇంటర్ బోర్డులో కానీ మంజూరైన పోస్టులను బట్టి విభజన జరగాలి తప్ప, పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను బట్టి కాదని పేర్కొన్నారు.