రైతు ఆత్మహత్యలు టీడీపీ, కాంగ్రెస్ లు తెలంగాణకు పెట్టిన భిక్ష అని, తెలంగాణలో వ్యవసాయాన్ని ఎండబెట్టిన పాపం మీదేనని ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే జూపల్లి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, ‘హీన రాజకీయాల కోసం రైతుల్లో అయోమయం సృష్టించొద్దు. వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించవద్దు. ఇప్పటికీ మీ పాపాల ఫలితంగానే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. మా నాయకుడు కేసీఆర్ చెరువుల పునరుద్ధరణ ఒక యజ్ఞంలా చేపడుతున్నారు’ అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
రైతులు లక్షలోపు తీసుకున్న అన్నిరకాల పంటరుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, రైతుల వద్ద పట్టా కానీ, 1-బీ ఖాతా సర్టిఫికేట్ కానీ లేకపోయినా లీజ్ హోల్డ్ సర్టిఫికేట్ ఉంటే చాలు పంటరుణాన్ని మాఫీ చేస్తామని ఈటెల హామీ అన్నారు. తెలంగాణ ఉప్పు, పప్పు తింటున్న ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు ఆంధ్రోళ్ళకు వంతపాడుతూ, తెలంగాణకే ద్రోహం చేస్తున్నారని, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ నాశనం కావాలని, రైతులు ఆత్మహత్య చేసుకోవాలన్న దురాలోచనతో ఉన్నారని మండిపడ్డారు.
తెలంగాణకు ద్రోహం చేయాలని అనుకుంటున్న వారిని తెలంగాణ చరిత్ర క్షమించదని, ప్రజలు పాతరేస్తారని, గతంలో రైతుల సమస్యలు విస్మరించి, వ్యవసాయాన్ని అధోగతి పట్టించిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించడానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దుచేసి కుట్రలు చేస్తున్నారని, రామగుండంలో ఉత్పత్తవుతున్న 2600 మెగావాట్ల విద్యుత్ లో 1300 మెగావాట్లు ఏవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు తరలుతున్నదని ప్రతిపక్ష నాయకులు అడిగారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు దక్షిణాది రాష్ట్రాలకు తరలిపోతున్న విద్యుత్ ను ఆపేలా చర్యలు తీసుకోవాలని రాజేందర్ సవాల్ విసిరారు.