ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారని, విపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బెదరదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీపై రైతులు సంబరాలు చేసుకుంటుంటే అభినందించాల్సింది పోయి బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
హామీలపై మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ ను విపక్షాలు విమర్శించడం విడ్డూరమని, ప్రతి విషయాన్ని ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. ఏపీలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు పొన్నాలకు లేదని, భారీ నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల చేసిన ఘనకార్యాల వల్లే ఇప్పుడు తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
