సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జేయేసీలు ఘనంగా జరుపుకున్నారు.
వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లిలోని చారిత్రాత్మక బురుజు వద్ద జరిగిన కార్యక్రమంలో టీఆరెస్ నేత ఈటెల రాజేందర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ “నంగనాచి మాటలు చెప్పి ఓట్లతో సీట్లు సంపాదించి,ఆ పలుకుబడితో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ఆంధ్రాపార్టీల జెండాలను కూల్చాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ‘లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే.. సీమాంధ్ర పార్టీలన్నీ సమైక్యాంధ్రకు మద్దతిచ్చేవే’ అని తెరాస అధినేత కేసీఆర్ ఆనాడే చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు ఆయన అన్నదే నిజమవుతోందన్నారు.
సీమాంధ్రుల కుట్రలు భగ్నంచేసి తెలంగాణ ప్రకటనను నిజం చేయించాల్సిన బాధ్యత టీ కాంగ్రెస్ నేతలదేనని, వారాపని చేయకపోతే ప్రజలు భరతం పడతారని ఈటెల హెచ్చరించారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం పదమూడు నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందన్నారు.
ఈ సభలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి, కూడా పాల్గొన్నారు.
తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర నాయకురాలు అల్లం పద్మ సహా అనేక మంది మహిళా నాయకురాళ్లు కూడా భైరాంపల్లి బురుజువద్ద జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిండ్రు.
పది తెలంగాణ జిల్లాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్, తెరాస, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వరంగల్, నల్గొండల్లో పోలీస్ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రయత్నించిన బీజేపీ నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు.