బుధవారం తెలంగాణ భవన్ లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు విజయారెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, పీజేఆర్ ప్రజానాయకుడని, ప్రజల కష్టాలే తన కష్టాలుగా జీవితాంతం పనిచేశారని, పదవులను తోసిపుచ్చి ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు.
మాటమీద నిలబడే వ్యక్తిగా పీజేఆర్ పేదప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన పౌరుషం, పట్టుదల, పంతం విజయారెడ్డికి ఉందని, ఇదే స్ఫూర్తితో ఖైరతాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలని కవిత సూచించారు. విజయారెడ్డి చేరిక ఆరంభం మాత్రమేనని, ఇకపై గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని పార్టీలనుండి చేరికలు ఉంటాయని ఆమె అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం గులాబీ జెండా ఎగిరేలా పట్టుదలతో పనిచేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పారని, ఆంధ్రోళ్ళను గుర్తించడానికి సర్వే చేపట్టారని ఆరోపణలు చేయడం దారుణమని, ఆంధ్రోళ్ళను గుర్తించడానికి సర్వే అవసరమా? అని కవిత ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ, ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ కు కంచుకోటగా మారుస్తానని, తన తండ్రి పీజేఆర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికై కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే అద్భుతంగా జరిగిందని, పీజేఆర్ తెలంగాణ వాది అని, పార్టీ బలోపేతానికి విజయారెడ్డి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కేకే అన్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తదితరులు హాజరయ్యారు.