విద్యుత్ శాఖలోని జెన్కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు 30% ఫిట్ మెంట్ తో కూడిన వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్షాసమావేశం నిర్వహించారు. అధికారులు, ఉద్యోగసంఘాల నాయకుల ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం వారికి 30% ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్న వారికి రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, విద్యుత్ శాఖలోని పెన్షనర్లకు కూడా 30% ఫిట్ మెంట్ తో కూడిన పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 600 కోట్ల అదనపు భారం పడనుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు కూడా అంకితభావంతో పనిచేయాలని, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఉద్యోగులదే ప్రముఖ పాత్ర అని కేసీఆర్ అన్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగులపై ఎంతగానో నమ్మకం ఉందని, అందుకే విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించామని, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని పెద్దఎత్తున విస్తరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.