శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేని పాఠశాలలను కిలోమీటర్ పరిధిలో ఉన్న వేరే పాఠశాలలో కలపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విద్యార్థులు లేని పాఠశాలలను మూసేస్తామని, అవసరానికి మించి ఉన్న టీచర్లను అదే మండలంలోని వేరే స్కూల్ కు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరిట ఈ సంవత్సరం నుండి బడి పండుగ కార్యక్రమం జరుపుతామని ప్రకటించారు.
20 మంది విద్యార్థులు ఉన్నచోట 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకే అవసరమైన వారిని ఉంచి ఎక్కువగా ఉన్నవారిని వేరేచోటకి పంపి వారి సేవలను వినియోగించుకుంటామని, తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రతి పాఠశాలలో ఆగస్ట్ కల్లా టాయిలెట్స్ నిర్మించాలని ఆదేశించామని, 14 ఏళ్లుగా పాఠశాలల్లో స్వీపర్ల నియామకాలు చేపట్టలేదని, రాబోయే రోజుల్లో స్వీపర్ల నియామకాలు చేపడతామని మంత్రి అన్నారు.