mt_logo

వేయిస్థంభాల గుడిలో కోటి కాంతులు

వేయిస్థంభాల గుడిలో వేయిపూలు వెలిగాయి.. బతుకమ్మలు బంగారు కాంతులను వెదజల్లాయి. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వరంగల్‌లోని వేయిస్థంభాల గుడిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువచ్చిందని చెప్పారు. అటు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వేర్వేరు చోట్ల శోభాయమానంగా నిర్వహించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా వేడుకలు సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎప్పుడూ నేరాలు, దర్యాప్తుల చుట్టూ తిరిగే పోలీసులు శుక్రవారం బతుకమ్మల చుట్టూ తిరిగారు. డీజీపీ కార్యాలయంలో మొట్టమొదటిసారి నిర్వహించిన బతుకమ్మ వేడుకలో పలువురు మహిళా పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

వేయిస్థంభాల గుడిలో డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల ఆటపాట
బతుకమ్మకు ప్రపంచఖ్యాతి: ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ సంబురాలు మూడో రోజు ఓరుగల్లు నగరంలో అంబరాన్ని అంటాయి. శుక్రవారం సాయంత్రం వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయంలో జరిగిన బంగారు బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా ప్రకటించి.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిందన్నారు.

బతుకమ్మ నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు అనవసర ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు కనీసం పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పలేని వ్యక్తి చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె కొట్టిపారేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు కేటాయించిన రూ. 10 కోట్ల నిధుల్లో హైదరాబాద్‌లో జరిగే సద్దుల బతుకమ్మకు రూ.9కోట్లు వెచ్చిస్తున్నామని, మిగతా కోటిరూపాయలు 10జిల్లాలకు అందజేస్తున్నామని వివరించారు. ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బతుకమ్మకు శాశ్వత కీర్తి దక్కేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కొనియాడారు.

అంతకుముందు హన్మకొండ ప్రాంతంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి వేయిస్తంభాల దేవాలయం వరకు ర్యాలీగా కదిలి వచ్చారు. అంతకుముందు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఇంట్లో కవిత కవిత బతుకమ్మలు పేర్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు పాల్గొన్నారు.

తెలంగాణభవన్‌లో బతుకమ్మ ఉత్సవాలు: తెలంగాణభవన్‌లో శుక్రవారం ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సంబురాల్లో రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయని అన్నారు. సంబురాల్లో టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పొలసాని వింధ్యారాణి, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ మహిళా ఉద్యోగులు శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో శాసనసభ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. కువైట్‌లో అక్కడి తెలంగాణ సమితి నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో గాయకుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భారత రాయబారి సునీల్‌జైన్ నిర్వాహకులు, కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ముత్యాల వినయ్, హరిప్రసాద్ పేర్కొన్నారు.

డీజీపీ ఆఫీసులో బతుకమ్మ సంబురాలు: రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మహిళా పోలీసులు, స్టాఫ్ శుక్రవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ శాఖ, తెలంగాణ జాగృతి సంయుక్తంగా డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు తమ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలను మొదటిసారి డీజీపీ కార్యాలయంలో స్వయంగా అనురాగ్ శర్మ నిర్వహిస్తున్నప్పుడు కొంత మంది ఐపీఎస్‌లు కార్యాలయంలోనే ఉండి పాల్గొనకపోవడం వివాదాస్పదంగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనర్ సీవీ ఆనంద్ దగ్గరుండి బతుకమ్మ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బతుకమ్మను అడ్డుకుంటారా..?: శ్రీనివాస్‌గౌడ్
ఉద్యమ సమయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించినం. సొంత రాష్ట్రంలో తొలిసారి జరుపుకుంటున్న బతుకమ్మను.. మా గడ్డ మీదనే అడ్డుకోవడం మంచి పద్ధతేనా..? అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సీమాంధ్ర ఉద్యోగులను ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీఎన్జీవో కార్యాలయంలో బతుకమ్మ ఆడనీయకుండా కొందరు సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆడపడుచులతో అసభ్యంగా ప్రవర్తించినా, అగౌరపర్చినా సహించేదిలేదు. రెచ్చగొడితే పొలిమేరలదాకా తరిమికొడతాం.. జాగ్రత్త అని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిచ్చి పట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కరీంనగర్‌లో నేడు బంగారు బతుకమ్మ
కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం బంగారు బతుకమ్మ కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ జాగృతి, నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ల ఆధ్వర్యంలో సంయుక్త నిర్వహించే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, నిజమాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత పాల్గొననున్నారు. శనివారం 11 గంటలనుంచి రాత్రి పదిగంటల వరకు నగరంలో వరుసగా జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎంపీ పాల్గొననున్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *