హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అంటున్న సీమాంధ్ర నేతలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్న సీమాంధ్ర నేతల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న సీమాంధ్ర నేతలు వాళ్ల ఇంట్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టారా? వాళ్ల అబ్బలు సంపాదించిన సొమ్మెమైనా ఇక్కడ ఖర్చు పెట్టారా? అని మండిపడ్డారు. ముమ్మాటికి హైదరాబాద్ తెలంగాణలో భాగమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్న వాళ్లు తిరుపతిని కూడా యూటీ చేయాలని అన్నారు. కేంద్రమంత్రి చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నాడు, హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి ఉంది అని అంటున్నాడు, చిరంజీవి ఆయన మామ ఇచ్చిన కట్నం ఏమైనా ఇక్కడ ఖర్చు చేశాడా? అని నిలదీశారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
వెళ్లిపోండి, ఇంకెంత దోచుకుంటారు: అసదుద్దీన్
‘సీమాంధ్ర నేతలారా, హైదరాబాద్‌ను యాబై ఏళ్లకు పైగా దోచుకున్నారు. ఇంకెంత దోచుకుంటారు? ఇంకెంత కాలం దోచుకుంటారు. వెళ్లిపోండి. వెళ్లి ఇంకో హైదరాబాద్‌ను నిర్మించుకోండి. రాజధాన్ని నిర్మించుకోండి. తెలంగాణ కోసం ఏడు వందల మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. అయినా మీకు కనిపించడంలేదా?’ అని ఆగ్రహంతో అన్నారు. ఆత్మబలిదానాలు చూసైనా సీమాంధ్ర నేతలు మారకపోవడం దారుణమని పేర్కొన్నారు. హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణలో భాగమేనన్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో