తెలంగాణలో విమానయాన, రక్షణపరమైన పరిశ్రమలు నెలకొల్పాలనే ఆసక్తి ఉందని అమెరికా విదేశీ వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఈ బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పారిశ్రామిక విధానంపై చర్చించింది. వచ్చే ఏడాది హైదరాబాద్ లో ఇండో అమెరికన్ సమ్మిట్ ను నిర్వహిస్తామని పేర్కొంది. త్వరలో హైదరాబాద్ లో తమ సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తామని అమెరికా విదేశీ, వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో మూడు లక్షల ఎకరాల భూమిని అందుబాటులోకి తేనున్నట్లు, పరిశ్రమల అనుమతుల్లో ఆలస్యం లేకుండా తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ను ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. రాష్ట్రంలో అమలుచేయబోయే పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, పైసా అవినీతి లేకుండా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటన షెడ్యూల్ లో హైదరాబాద్ ను చేర్చాలని సీఎం అమెరికా బృందాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఒకరైన ఓరియంట్ సిమెంట్స్ అధినేత సీకే బిర్లా శనివారం సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు తెలిసింది.