ఉప్పల్ రింగ్‌రోడ్డులో చేపడుతున్న స్కైవాక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్‌ల పనులు కొనసాగుతున్నాయి. వరంగల్-ఉప్పల్, సికింద్రాబాద్-ఉప్పల్, నాగోల్-ఉప్పల్, రామంతా పూర్-ఉప్పల్ రోడ్డు మార్గాలతోపాటు, మరోరెండు చోట్ల పాదచారులకు అనుగుణంగా లిఫ్ట్‌లు, మెట్ల మార్గాలను నిర్మిస్తున్నారు. వీటికి తోడుగా స్కైవాక్‌ను మెట్రో స్టేషన్‌కు కలుపుతున్నారు.
దీంతో రింగ్‌రోడ్డులో స్కైవాక్ ద్వారా మెట్రోస్టేషన్‌కు చేరుకోవచ్చు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో రద్దీ దృష్ట్యా పాదచారులు రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సుమారు రూ.28 కోట్లతో స్కైవాక్ పనులు చేపడుతుంది. ఈ స్కైవే ఉప్పల్ పాదచారుల, ప్రయాణికుల సమస్యలు తీర్చడంతోపాటు, ఆహ్లాదాన్ని పంచనుంది. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.