mt_logo

కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం పొందాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరిట ఆచరణ సాధ్యంకాని, అలవిగాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైంది.. అబద్ధాల ఆట ప్రారంభించేసింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, కొత్త సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు చేయొచ్చు అనే కనీస అవగాహన లేకుండా హామీలు గుప్పించింది. రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జాతీయ నేతలు అప్పజెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆచరణ సాధ్యంకాని హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి అయ్యే ఖర్చు అక్షరాలా 2.56 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ వార్షిక బడ్జెటే 2.70 లక్షల కోట్ల రూపాయలు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన కొత్త హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు 95% మొత్తం వాటికే కేటాయించాలి. ఇది అయ్యే పని కాదు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి అయ్యే ఖర్చుల వివరాలు
పెన్షన్లు – రూ. 39,110 కోట్లు
ఇందిరమ్మ ఇళ్ళు – రూ. 55,200 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు – రూ. 60,900 కోట్లు
రైతులకు – రూ. 69,500 కోట్లు
మహాలక్ష్మి – రూ. 16,700 కోట్లు
గ్రామ పంచాయతీలకు – రూ. 1,250 కోట్లు
2 లక్షల ఉద్యోగాలకు – రూ. 6,000 కోట్లు
గృహ జ్యోతి – రూ. 7,200 కోట్లు

మొత్తం కలిపి 2.56 లక్షల కోట్లు, అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 95% పైగానే. విచిత్రం ఏంటంటే ఈ గ్యారంటీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే అమల్లోకి తెస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించేశారు. ఉదాహరణకు కర్ణాటకనే తీసుకుంటే, నోటికి వచ్చిన సంక్షేమ పధకాలను ప్రకటించేసి, అక్కరలేని హామీలిచ్చి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించింది, తీరా అధికారం చేతికి వచ్చాక వాటిని అమలు చేయలేక, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఖజానా ఖాళీ అయిపోయి ఆగమాగమై కుక్కలు చింపిన విస్తరిలా మారింది.

తెలంగాణలో రూ. 4,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. తాము పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఏ రాష్ట్రంలోనూ 1000 రూపాయలు మించి పెన్షన్ ఇవ్వట్లేదు.

కరెంటు లేక అక్కడి రైతులు, చిన్నతరహా పరిశ్రమల వాళ్ళు రోడ్లమీద ధర్నాలు చేసే స్థితికి తెచ్చారు. అక్కడ వాగ్దానం చేసిన ఐదు గ్యారంటీ పథకాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. గృహ జ్యోతి, ఉచిత విద్యుత్తు, యువనిధి లాంటి పథకాలను ఇంకా ప్రారంభించనేలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా చెప్పిన హామీలు అమలుచేయడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎలా అమలు చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్న.