తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ నగరం నాశనం అయ్యిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆగమాగం అయ్యిందని మొత్తుకోవడం సమైక్యవాదులకున్న ఒక దురలవాటు. ఏ చిన్న కారణం దొరికినా తెలంగాణ ఉద్యమం మీద విషం చిమ్మడానికి సదా సిద్ధంగా ఉండే సీమాంధ్ర మీడియా సాయంతో వీరు గోరంతలు కొండతలు చేస్తుంటారు. అర్థసత్యాల ఆదారంగా అల్లిన విష కథనాలతో రెచ్చిపోతుంటారు. కానీ నిజం నిప్పు లాంటిది. దానికి అబద్ధాలనే మసిపూసి మారేడుకాయ చేయలేం.
ఉద్యమం కారణంగా “బ్రాండ్ హైదరాబాద్” దెబ్బతినిపోతుందని సమైక్యవాదులు గగ్గోలుపెట్టిన ప్రతిసారి నిజాలేమిటో కొన్ని నిష్పాక్షిక సంస్థల రిపోర్టుల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ప్రఖ్యాత అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎండ్ ఇండస్ట్రీ (అసోచాం) వెలువరించిన ఒక నివేదిక విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థాయిలో ఉన్నదని తేల్చింది.
2011-2012 వార్షికంలో 33,936 కోట్ల పెట్టుబడులతో 70 ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకువచ్చాయని ఆ నివేదిక పేర్కొంది. గుజరాత్ 20,258 కోట్ల పెట్టుబడులతో మూడో స్థానంలో ఉన్నది. దీని వల్ల మనకు అర్థం అయ్యేదేమిటంటే ఉద్యమం వల్ల “అభివృద్ధి” కుంటుపడిందనే సమైక్యవాదుల మాట ఒట్టి సొల్లు మాట అని. హైదరాబాదులో కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కానీ పెట్టుబడులు పెట్టాలనుకుని వచ్చేవారికి ఇక్కడి ఉద్యమం కారణంగా ఏ ఇబ్బందీ కలగడం లేదని.
తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాదుకు గానీ ఆంధ్రప్రదేశ్ కు గానీ కించత్ నష్టం వాటిల్లలేదు. వాటిల్లదు కూడా. ఆ విజ్ఞత తెలంగాణ పౌరులకు ఉన్నది. లేనిదల్లా స్వంత రాష్ట్రాన్ని అబద్దపు వార్తల్తో భ్రష్టు పట్టిస్తున్న సీమాంధ్ర మీడియాకు, నాయకులకు, కుహానా సమైక్యవాదులకు.
2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మీడియా సమావేశాలు పెట్టి మరీ కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని దొంగ అబద్ధాలు ఆడాడు. ఏయే కంపెనీలు తరలిపోయాయో లిస్ట్ ఇవ్వమని అడిగితే మాత్రం ఇదే ప్రభుత్వం నుండి స్పందన లేదు.
చూడండి వీళ్లకు సమైక్య రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉన్నదో. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన స్వంత రాష్ట్రం నుండి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని అబద్దాలు ఆడటం ఎక్కడైనా విన్నామా?
అందుకే మేమంటాం నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో సమైక్యవాదుల్లో సమైక్యత అంతేనని.
—
—
తెలంగాణ ఉద్యమంపై సమైక్యవాదుల అబద్ధాలు తుత్తునియలు చేసే ఇంకొన్ని కథనాలు కింద చదవండి:
—
– “Brand Hyderabad” intact despite Telangana agitation
– Brand Hyderabad Intact: Facebook expanding Hyderabad office
– నష్టాలెవరికి నలమోతు గారూ? (మొదటి భాగం)