mt_logo

వరి అంటే ఉరి అనే పరిస్థితి కల్పించిన కేంద్ర ప్రభుత్వం

ముందుచూపు లేని కేంద్ర ప్రభుత్వం వల్ల దేశవ్యాప్తంగా రైతులు వరి పండించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఐదేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు పేరుకున్నాయని, ఇకనుండి కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని, రైతులు కేవలం సన్న రకాలు మాత్రమే పండించాలని, అది కూడా కొంతవరకు మాత్రమే పంట కొనుగోలు చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తేల్చి చెప్పింది.

 

ఇదే విషయం మీద ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేమి వల్ల రైతులు వరి పండిస్తే ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం మరియు ఇతర ప్రాజెక్టుల సాగు నీరు అందుబాటులోకి రావడం, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు సహాయం వల్ల రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 55 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనివల్ల ఏటా కేవలం వానకాలంలోనే 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతోంది. ఇది కాకుండా యాసంగి పంట దిగుబడి కూడా అధికంగానే ఉంటోందని అన్నారు. అయితే వచ్చే ఐదు సంవత్సరాలకు సరిపడా ధాన్యం నిలువలు తమ గిడ్డంగుల్లో పేరుకు పోయాయని ఇక నుండి కేవలం 60 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం మాత్రమే ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ అయిన దొడ్డు రకం వడ్లు ఒక్క కిలో కూడా కొనమని కేంద్రం చెబుతోందని, ఇక రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతులను ఇతర పంటలవైపు మళ్లించడం,వాటికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం లాంటి ప్రత్యామ్నాయల గురించి ఏమాత్రం ఆలోచించని కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై ఒక్కసారిగా చేతులు ఎత్తేయడంతో రైతులకు దిక్కు తోచని పరిస్థితుల ఏర్పడ్డాయని అన్నారు.

 

నూనె పంటలైన వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు తో పాటు పప్పు ధాన్యాలు, కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తే రైతులు లాభపడతారని.. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కలిగించాలని సీఎం సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద గత యాసంగికి సంబంధించి 2000 వేల కోట్ల అదనవు భారం మోపబడిందని, రైతుల పరిస్థితి అర్థం చేసుకున్నప్పటికీ ఈ ఏడాది అదనపు భారం మోసే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *