ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరతామని అన్నారని, మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారని, అన్ని పార్టీల నేతలూ సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నారని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఆన్నారు. డీసీసీ కార్యదర్శి రాగం నాగేందర్ యాదవ్, ఆయన భార్య సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ సుజాతా యాదవ్ సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు గురువారం టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు కేకే, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరిపోయే దీపాలని, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగురవేస్తామని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించుకునేందుకు భారీగా వలసలు వస్తున్నారని, మీపై భరోసా లేక మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే రైతులకేం భరోసా ఇస్తారని, ఇటువంటి వారిని ప్రజలు నిలదీస్తారని అన్నారు.
రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని, గత ప్రభుత్వాలు తెలంగాణలో బొగ్గు నిల్వలు ఉన్నా, గోదావరి నది వద్ద ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టును నిర్మించలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రైతులకు అండగా నిలిచారని, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో 6000 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్లు, సౌర విద్యుత్ ద్వారా 4000 మెగావాట్లు, మహబూబ్ నగర్ జిల్లాలో మరో 2000 మెగావాట్లతో కలిపి మొత్తం 16వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారన్నారు. రాబోయే మూడేళ్ళలో విద్యుత్ రంగంలో మిగులు ఉత్పత్తి సాధించడమే తమ ధ్యేయమని హరీష్ రావు, కేకే చెప్పారు.