తెలంగాణను చుట్టుముట్టిన పోలీసులు
పది వేల మందికిపైగా పోరుబిడ్డల అరెస్టులు, బైండోవర్లు
వందలాదిగా చెక్‌పోస్టులు.. వేలకు వేలు పోలీసులు
వెనక్కు తగ్గని తెలంగాణవాదులు
చలో అసెంబ్లీకి సన్నద్ధం
హైదరాబాద్, మే 12
తెలంగాణ పది జిల్లాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ ప్రాంతమంతా ఖాకీ వలయంలో చిక్కుకుంది. హైదరాబాద్‌కు వచ్చే అన్ని రోడ్లపై వందలాది పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ ఎవరిని పడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అత్యావసర పనులపై హైదరాబాద్‌కు వెళ్తున్న సామాన్య ప్రజలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకూ పది వేల మందికి పైగా పోరుబిడ్డలను పోలీసులు అరెస్టులు, బైండోవర్ల పేరుతో నిర్బంధించారు. అయినా తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రాజకీయ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఎక్కడి అక్కడే బైండోవర్ల పేరుతో కట్టడి చేస్తోంది.
చలో అసెంబ్లీని అడ్డుకుని తీరుతామని సర్కార్ చెబుతుండగా, నిర్వహించి తీరుతామని తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క మెదక్ జిల్లాలోనే సుమారు వెయ్యి మందికి పైగా బైండోవర్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగే సభలు, సమావేశాలకు జనాలను రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ట్రాన్స్‌పోర్ట్, విద్యా సంస్థల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణ జిల్లాల్లోని ప్రధాన రహదారులను లక్ష్యంగా చేసుకుని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాహదారిపై వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికి, ఏం పనిమీద వెళుతున్నారని ఆరా తీస్తున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, కరీంనగర్ జిల్లా నాయకులను అరెస్టు చేసేందుకు విఫలయత్నం చేశారు. తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ తదితరులను హైదరాబాద్‌లోని బోరబండలో జరిగిన సన్నాహక సదస్సు సందర్భంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. వరంగల్‌లో జరిగిన ‘ఓరుగల్లు పోరుయాత్ర’ సభా స్థలం చుట్టూ పోలీసులు మోహరించి అతి చేశారు. అనేక జిల్లాల్లో అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
వరంగల్ జిల్లాల్లో సుమారు 500 మందికిపైగా బైండోవర్ చేసినట్టు సమాచారం. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇదే విధంగా ఉంది. అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళుతున్న మహిళలను చలో అసెంబ్లీకి ముందస్తుగా వెళుతున్నారని వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రాస్తారోకోకు దిగారు. చలో అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ జేఏసీ జనం భారీగా తరలించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లక్షలాది జనాలను హైదరాబాద్‌కు తరలించేందుకు జేఏసీ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ జిల్లాల్లోని ప్రతి గ్రామం నుంచి కనీసం 30 మంది చొప్పున తరలి వచ్చేలా సమన్వయం చేస్తోంది. ఇప్పటికే సమీప జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యమకారులు హైదరాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. కనీసం 5 లక్షల మంది చలో అసెంబ్లీలో కదం తొక్కనున్నారని సమాచారం. ఈ మేరకు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికే తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను సమీక్షించడమే కాక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్బంధం నేపథ్యంలో చాపకింద నీరులా ఉద్యమకారులు హైదరాబాద్‌కు తరలివచ్చేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే చాలా వరకు తెలంగాణ జిల్లాల్లో టీ జేఏసీ సమావేశాలు నిర్వహించి, వాల్ పోస్టర్లు ఆవిష్కరించి తెలంగాణవాదులను కార్యోన్ముఖులను చేసిందనే చెప్పాలి. పైగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఉద్యమ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా నిర్వహించితీరుతామని ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. మరో వైపు ఉద్యోగ జేఏసీ ఒక అడుగు ముందుకేసి సర్కార్ ఇదే విధంగా దమనకాండను, నిర్బంధాలను కొనసాగిస్తే తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.
[జనంసాక్షి సౌజన్యంతో]