mt_logo

ఉద్యోగసంఘాల నేతలతో భేటీ కానున్న కేసీఆర్

రాష్ట్ర విభజన చివరిదశకు చేరుకున్నా, సీమాంధ్ర ఉద్యోగులు స్థానికత విషయంలో చేస్తున్న కుట్రలపై ఆందోళన చెందిన తెలంగాణ ఉద్యోగులు టీఆర్ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి తమ సమస్యలు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు గురువారం కొంపల్లిలో ఉద్యోగసంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల స్థానికతను నిర్ణయించే దిశగా బుధవారం 6గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారు.

సచివాలయంలో 200మంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అక్రమంగా తిష్ట వేసిన సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేందుకు పంపిస్తామని మున్సిపల్ అధికారులసంఘం నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాకు పదివేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అన్ని ఉద్యోగసంఘాల నేతలతో కేసీఆర్ విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం సూచించే దిశగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ లోని 70సంఘాల ప్రతినిధులు, అధ్యక్ష, కార్యదర్శులు, కన్వీనర్లు, 10 జిల్లాలలోని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సేమాంధ్ర ఉద్యోగులు స్వచ్చందంగా వారి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాలని కేసీఆర్ సీమాంధ్ర ఉద్యోగసంఘాలకు విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *