టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా దూసుకుపోతోంది. ఈనెల 3 న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారం రోజుల్లోనే 11 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. పది జిల్లాలనుండి ప్రజలు భారీగా తరలిరావడంతో ముందుగా అనుకున్న ముప్పై లక్షల సభ్యత్వాన్ని 38 లక్షలకు పెంచారు. నిజానికి పుస్తకాలు తీసుకున్న మొదటి ఒకటిరెండు రోజులు వాటిని కార్యకర్తలకు అప్పగించడం, ఇతర పనులకు సరిపోతుంది. అయినా వారం తిరక్కుండానే వివిధ నియోజకవర్గాలనుండి, జిల్లాల నుండి తమకు ఇంకా సభ్యత్వ పుస్తకాలు కావాలని సమాచారం వస్తుంది. అందుకే మొదట 30 లక్షల సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చిన నేతలు డిమాండ్ కు అనుగుణంగా 38 లక్షల పుస్తకాలు అందజేశారు.
మెదక్ జిల్లా గజ్వేల్ లో ఇప్పటికే 30 వేల సభ్యత్వం పూర్తయిపోయింది. సిద్దిపేటలో కూడా మరో 30 వేల సభ్యత్వ పుస్తకాలు కావాలని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ, భువనగిరి, కోదాడ, వరంగల్, పరకాల, మహబూబాబాద్, కరీంనగర్, రామగుండం తదితర నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే 2 లక్షల సభ్యత్వం పూర్తి కాగా, ఖమ్మం జిల్లాలో కూడా మరో 30 వేల సభ్యత్వ నమోదు పుస్తకాలు కోరారు. ఒక ఉద్యమంలా సభ్యత్వ కార్యక్రమం కొనసాగాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు నేతలు గ్రామాలు, పట్టణాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.