హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన – 2015ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మన ఊరు-మన కూరగాయలు స్టాల్, వీటికోసం వినియోగించనున్న ఆటోలకు ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేసిన పాలపిట్ట, జింక, తెలంగాణ స్థూపం, పది జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాపును, ప్రదర్శనలో ఉంచిన 160 స్టాల్స్ ను సీఎం తిలకించారు.
ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఉద్యానవన సాగుకు ఇస్తున్న ప్రోత్సాహంపై రైతులతో సీఎం చర్చించారు. అంతేకాకుండా రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలు, దిగుబడి, ధరలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్త సరితారెడ్డి సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం, హరీష్ రావు, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.