mt_logo

త్వరలో ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు..

తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నేతలు దేవీప్రసాద్, సీ విఠల్, కారం రవీందర్ రెడ్డి, ఎమెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఉద్యోగుల పీఆర్సీ, ఆరోగ్య కార్డులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దీనిపై స్పందించిన సీఎం పదో ఆర్ధిక వేతన సవరణకు సంబంధించిన నివేదికను తనకు వెంటనే సమర్పించాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డిని ఆదేశించారు. ఆరోగ్య కార్డులను వెంటనే విడుదల చేస్తామని, సర్వీస్ రూల్స్, జోనల్ విధానం తదితర అంశాలపై త్వరలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిద్దామని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.

కాలం చెల్లిన సర్వీస్ రూల్స్ ను మార్చాలని, అనుభవజ్ఞులైన ఉద్యోగులతోనే సర్వీస్ రూల్స్ ను తయారు చేయించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఉద్యోగుల విభజనను పూర్తి చేయడానికి తెలంగాణ ఎంపీలతో కూడిన బృందాన్ని కేంద్రానికి పంపించనున్నట్లు కేసీఆర్ వారికి చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పీఆర్సీ, హెల్త్ కార్డుల అంశాలకు సంబంధించి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, మరికొందరు నేతలు ప్రస్తావించినప్పుడు సీఎం స్పందించి వెంటనే ఫైళ్ళను తెప్పించుకుని చూశారని, ఉద్యోగుల కష్టాలు కేసీఆర్ కు బాగా తెలుసని అన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగసంఘాల నేతలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *