హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో నగర ప్రజలతో టీవీల ద్వారా ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో నేరుగా మాట్లాడనున్నారు. నగరవాసులు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశిస్తున్నారు. మహా నగరం ఎలా ఉండాలనుకుంటున్నారని? ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారని? సిటీలోని పేదలకు ప్రభుత్వం ఇంకా ఏమైనా పథకాలు తేవాలా? అని, ఇప్పుడున్న వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని నేరుగా సీఎం ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
నగరవాసులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గత పాలకులు చేసింది ఏమీ లేకపోగా, మాస్టర్ ప్లాన్ అమలు పేరుతో వీలైన చోట రోడ్లను విస్తరిస్తూ వీలుకానిచోట రోడ్లను అట్లాగే వదిలేస్తూ సమస్యలను అధికం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నగర సమస్యలపై సీఎం ప్రధాన దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోబోయే చర్యలతో పాటు నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో సీఎం ప్రజలకు వివరించనున్నట్లు, ఈ కార్యక్రమం త్వరలో ప్రజలముందుకు రానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.