mt_logo

సీఎం కేసీఆర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నేతలు

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫోరం నేతలు గురువారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పదిజిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర నాయకులు క్రాంతి, పల్లె రవి, ఎం రమణ నేతృత్వంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర సాధనకోసం అలుపెరుగని పోరాటాలు చేసిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు సీఎం ను కోరారు.

అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు, అల్లం నారాయణ ఆధ్వర్యంలోని టీయూడబ్ల్యూజేను రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘంగా ప్రకటించాలని తాము కోరినవెంటనే కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. ఇదిలావుండగా ఈనెలాఖరులో హైదరాబాద్ లో జరగనున్న రాష్ట్రస్థాయి మహాసభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పల్లె రవి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులివ్వాలని, ప్రతీ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు జరీ చేయాలని కోరామని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ వర్కింగ్ జర్నలిస్టుకు ఇండ్ల స్థలం పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని అమలుపరచాలని కోరామన్నారు.

2009లో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం అర్బన్ మండలమైన వెలుగుమట్ల పంచాయితీ పరిధిలో 10ఎకరాలకు పైగా స్థలాన్ని జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలుగా కేటాయించగా 2013లో ఖమ్మం జిల్లా కలెక్టరుగా పనిచేసిన సిద్దార్థ జైన్ ఆ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వేరేవాళ్ళకు కేటాయించారని ఖమ్మం జిల్లాకు చెందిన టీయూడబ్ల్యూజే నేతలు సీఎం కు విన్నవించారు. వెంటనే కేసీఆర్ స్పందించి నివేదిక అందించాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టరుకు ఆదేశాలు జారీ చేసినట్లు వారు మీడియాకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *