గులాబీ జోరు..

  • January 31, 2019 11:37 am

అదే స్పీడు.. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ హవాకు తిరుగులేదు. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరవేసింది. బుధవారం 3,506 పంచాయితీలకు పోలింగ్ నిర్వహించగా, టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2,742 పంచాయితీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేశారు.వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తం మూడు విడతల్లో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 8,606 స్థానాల్లో విజయం సాధించారు. మొదటి విడతలో 85.76%, రెండవ విడతలో 88.26%, మూడవ విడతలో 88.03% పోలింగ్ నమోదు అయింది.

జిల్లాల వారీగా చూస్తే ఎనిమిది జిల్లాల్లో 90% పైగా, 17 జిల్లాల్లో 80% పైగా, మిగిలిన రెండు జిల్లాల్లో కూడా 79.81%, 77.70% ఓటింగ్ నమోదు అయింది. గ్రామాల్లో ఓటర్ల చైతన్యం పెరిగిన ఓటింగ్ శాతం బట్టి తెలుస్తుంది. మూడు విడతల్లో కలిపి మొత్తం 86.67% పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిలావుండగా వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తిరుమలాపూర్ గ్రామ పంచాయితీ ఏడవ వార్డుకు రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడవ విడతలో భాగంగా ఇక్కడ కమ్లిబాయి అనే మహిళ ఓటు హక్కును వేరొక మహిళ వినియోగించుకుంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఫిబ్రవరి 1 వ తేదీన వార్డు మెంబర్ ఎన్నికతో పాటు ఆ వార్డులో సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.


Connect with us

Videos

MORE