శాసనమండలి చైర్మన్ స్థానానికి మంగళవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 2న శాసనమండలి చైర్మన్ ఎన్నిక ఉంటుందని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ రాజా సదారాం సర్క్యులర్ జారీ చేశారు. ఇదిలా ఉండగా శాసనమండలి చైర్మన్ పదవి టీఆర్ఎస్ కే దక్కుతుందని ఖచ్చితంగా తెలుస్తోంది.
ఈ అంశంపై చర్చించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం సోమవారం నాడు జరుగగా, ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి కూడా హాజరయ్యారు. దీనిని బట్టి యాదవరెడ్డి కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ శాసనమండలిలో 40 స్థానాలు ఉండగా అందులో ప్రస్తుతం 35మంది సభ్యులు ఉన్నారు. 18మంది సభ్యుల బలం ఉంటే మండలి చైర్మన్ సీటు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ లో ఇంతకుముందు మొత్తం 17మంది సభ్యులుండగా వారిలో ఐదుగురు సభ్యులు ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాకుండా టీడీపీ నుండి ఇద్దరు ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ టీచర్స్ ఎమ్మెల్సీలు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ బలం 16కు పెరిగింది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్ రావు కూడా కారెక్కడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.
వీరితోపాటు ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్సీలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉండగా పూర్తి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతుతో మండలి చైర్మన్ పదవి సొంతం చేసుకోవడానికి ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ను అభ్యర్థిగా నిలపాలని చూస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 12 కాగా, నేతి విద్యాసాగర్ రావు, యాదవరెడ్డిలు రాజీనామా చేస్తే ఆ సంఖ్య 10కి పడిపోనుంది.