ఉద్యోగుల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్న సందర్భంగా ఉద్యోగుల స్థానికత వివరాలు తెలుసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో శుక్రవారం వార్‌రూం ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ఇస్తున్న స్థానికత వివరాలలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ వార్‌రూం ప్రారంభించబడింది. హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ల పర్యవేక్షణలో శనివారం నుండి ఈ వార్ రూమ్ పనిచేస్తుంది.
జూన్ 2న కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నందున ఈ లోపు సేకరించిన ఉద్యోగుల స్థానికత వివరాలను ఒక నివేదికరూపంలో ప్రభుత్వానికి ఈ కమిటీ సభ్యులు అందజేస్తారు. ఉద్యోగుల స్థానికత అంశాలను తెలుసుకోవడానికి ఆరుగురు సభ్యులతో కేసీఆర్ ఇటీవలే ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల పంపకాలపై ఏమైనా అభ్యంతరాలుంటే www.trs.org అనే వెబ్ సైట్ కు కానీ, trswarroom@gmail.com ఈ మెయిల్ కు కానీ ఫిర్యాదులు అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు. మొహమాటానికి పోకుండా రెవెన్యూ ఉద్యోగులు, గ్రూప్ 2 ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీమాంధ్ర ఉద్యోగుల వివరాలను అందజేయాలని, వెబ్ సైట్ లో ఏమైనా వివరాలు పంపాలంటే జిరాక్స్ లు అప్‌లోడ్ చేయొచ్చని సూచించారు.