ఈనెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని, ప్లీనరీ సమావేశాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియంకు ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నిర్ణయించామని, మరుసటిరోజు 12వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వివరించారు.
ప్లీనరీకి వస్తున్న ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు, నగరాన్ని సుందరంగా అలంకరిస్తామని, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లీనరీ, బహిరంగసభల నిర్వహణ కోసం వేసిన కమిటీలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయని, ప్రభుత్వం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్లీనరీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు. పదమూడు సంవత్సరాలుగా పార్టీకి పునాదిరాళ్ళుగా పనిచేసిన కార్యకర్తలను గౌరవించుకోవడమే ప్లీనరీ ఎజెండా అని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ప్లీనరీ ఉంటుందన్నారు.