ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు జరిపారు. పార్టీ ప్లీనరీని ఈనెల 11 న జరపాలని, భారీ బహిరంగసభను మరుసటిరోజు అంటే అక్టోబర్ 12 న జరపాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం ఒకే సమయంలో ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ ఆలోచన.
లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ప్లీనరీకి ప్రతి నియోజకవర్గం నుండి 300 మంది వరకు ముఖ్యనేతలు, కార్యకర్తలు అంటే మొత్తం మూడువేలమంది రానున్నారు. 12 న జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిమందిని సమీకరించాలని నిర్ణయించారు. జన సమీకరణ బాధ్యతలను ఆదిలాబాద్ లో జోగు రామన్న, మెదక్ లో టీ హరీష్ రావు, వరంగల్ లో టీ రాజయ్య, కరీంనగర్ లో ఈటెల రాజేందర్, రంగారెడ్డిలో పీ మహేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంత్రుల ప్రాతినిధ్యం లేనందున ఆ బాధ్యతను ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు, మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డికి అప్పగించారు. హైదరాబాద్ లో ముగ్గురు మంత్రులుండగా అందులో హోం మంత్రి నాయిని చికిత్స నిమిత్తమై ఆస్పత్రిలో ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హజ్ యాత్రలో ఉన్నందున హైదరాబాద్ లో జనసమీకరణ బాధ్యతను మంత్రి టీ పద్మారావుతో పాటు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.
పార్టీ కోసం, తెలంగాణ కోసం పోరాడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం త్వరలో నాలుగువేల నామినేటడ్ పదవులు పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తించే బాధ్యతను జిల్లా మంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.
