దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతున్నదని, అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కానున్నదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ స్థానానికి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశ సమస్యలు పరిష్కారం కాలేదు. ఐదేళ్ళ క్రితం ఉనికిలో లేని తెలంగాణ నేడు దేశంలోనే నంబర్ వన్ గా ఉంది. గత ఎన్నికలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. పక్కా 16 ఎంపీ స్థానాలు గెలుస్తాం. 9 సీట్లు ఉన్న పార్టీ నేతలు కూడా ప్రధానులు అయ్యారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ లో మాట్లాడి 11 ప్రైవేట్ బిల్లులు పెట్టించానని, కులవృత్తుల అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నానని తెలిపారు. భువనగిరి అభివృద్ధిపై కోమటిరెడ్డి సోదరులతో చర్చకు సిద్ధమన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఉండికూడా బత్తాయి మార్కెట్ సాధించలేక పోయారు. నల్లగొండ ఇంకా కార్పొరేషన్ స్థాయికి చేరకపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణం అని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.