జూన్ 1వ తేదీన జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు గురువారం ఉదయం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, కే యాదవరెడ్డి, బీ వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఆకుల లలిత, టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఐదో అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించడంతో ఎన్నికల్లో పోటీ అనివార్యమైంది.2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి 65, కాంగ్రెస్ నుండి 21, టీడీపీ నుండి 15, ఎంఐఎం నుండి ఏడుగురు, బీజేపీ నుండి ఐదుగురు, వైసీపీ నుండి ముగ్గురు, సీపీఐ, సీపీఎం, స్వతంత్రులుగా ఒక్కొక్కరు సభ్యుల చొప్పున ఎన్నికయ్యారు. నామినేటెడ్ సభ్యుడితో సహా మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి వస్తున్న సంపూర్ణ మద్దతు చూసి వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుండి నలుగురు, టీడీపీ నుండి నలుగురు, వైసీపీ నుండి ఇద్దరు మొత్తం 10 మంది సభ్యులు చేరడంతో టీఆర్ఎస్ బలం 75 కు పెరిగింది. కాంగ్రెస్ కు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు మాత్రమే ఉండగా టీఆర్ఎస్ కు పలు పార్టీల మద్దతు లభించనుంది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న 75 మంది సభ్యుల బలంతో ఖచ్చితంగా నలుగురు ఎమ్మెల్సీలు గెలుపొందుతారు. కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం 18గా ఉండటంతో ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ విషయానికి వస్తే ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు సభ్యులున్న మిత్రపక్షం బీజేపీని కలుపుకుంటే వారి బలం 16కు చేరుతుంది. ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు టీడీపీకి కావాల్సి ఉంటుంది.
టీఆర్ఎస్ పార్టీనుండి నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలవడానికి 72 ఓట్లు సరిపోనుండగా, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు టీఆర్ఎస్ కు ఉండటంతో ఐదో అభ్యర్థికి కావాల్సిన 18 ఓట్లలో 10 ఓట్లు మిగులుతాయి. నామినేటెడ్ సభ్యుడి మద్దతు కూడా టీఆర్ఎస్ కు ఉండటంతో బలం 11కు చేరుతుంది. ఇంకా ఏడుగురి మద్దతు కావాల్సి ఉండగా సీపీఐ, సీపీఎం నుండి ఇద్దరు సభ్యులు, వైసీపీకి మిగిలిన ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా అధికార పార్టీకే ఉంటుందని టీఆర్ఎస్ నేతల గట్టి నమ్మకం. కాగా ఐదో స్థానం దక్కాలంటే ఇంకా నలుగురు సభ్యుల మద్దతు టీఆర్ఎస్ కు కావలసిఉంది. రహస్య ఓటింగ్ కావడంతో వేరే పార్టీల నుండి సభ్యులు జంప్ అయితే అధికార టీఆర్ఎస్ ఐదో స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.