mt_logo

తెలంగాణ ఏర్పాటుకు, తెరాస విలీనానికి సంబంధం లేదు: డీఎస్

మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ సోమవారంనాడు 10 జనపథ్ లో సోనియాగాంధీతో ౩౦ నిమిషాలపాటు సమావేశమయ్యాక ఏపీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఆందోళన వద్దని, ఏర్పాటు ప్రక్రియలో ఆలస్యం ఉండదని అన్నారు. రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని కూడా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం గురించి సోనియాతో చర్చించానని వివరించారు. టీఆర్ఎస్ తో విలీనం ఉంటుందా అని ప్రశ్నించగా, తెలంగాణకు, విలీనానికి సంబంధం లేదని, తెలంగాణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వడానికి ఎన్నికల పొత్తులు ముఖ్యం కాదు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే తెలంగాణ ఇస్తుందని, 60 దశాబ్దాల పోరాటం తర్వాతనే తెలంగాణ వచ్చిందని, వివరించారు. టీఆర్ఎస్ తో పొత్తా? లేక విలీనమా? అని ప్రశ్నించగా, టీఆర్ఎస్ తో సానుకూల సంబంధం ఉంటుందన్నారు. టీఆర్ఎస్ తో విలీనం కంటే పొత్తు పెట్టుకోవడమే మంచిదని సోనియాకు వివరించినట్లు సమాచారం. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో అధిక మెజార్టీ వస్తుందని, విలీనం వల్ల ప్రతిపక్ష పార్టీలు చెలరేగిపోయే పరిస్థితి ఉందని, టీఆర్ఎస్ బలంగా ఉంటేనే లోకసభ లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని సోనియాకు వివరించారు. తెలంగాణలో గెలిచే అవకాశాలున్న చోట్ల టీఆర్ఎస్ కు సీట్లు కేటాయించాలని, అది చేస్తే ఇరు పార్టీలకూ మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *