రేవంత్‌రెడ్డి వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను టీడీపీ మోసం చేస్తుందని, ఆంధ్రాబాబు అసలు రంగు బయటపడిందని, అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారన్నారు. టీడీపీ పార్టీకి ఇక తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు మేలుకోవాలని జూపల్లి సూచించారు.
తెలంగాణ ఉద్యమకాలంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్‌రెడ్డికి పౌరుషం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు తమ పార్టీలో చేరారని, అయితే ప్రజాభిప్రాయం ప్రకారమే తెలంగాణ పక్షాన చేరితే తప్పెలా అవుతుందని జూపల్లి పేర్కొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటువేయాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఆశచూపి అవినీతికి పాల్పడిన రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. ఈ కుట్రను పన్నింది చంద్రబాబు అయితే దానిని ఆచరించింది రేవంత్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చాడని, డబ్బు సంచులతో ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళడం లాంటివి దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.